Wednesday, May 18, 2011

ఏమిటీ శాపం! ఎక్కడుందీ లోపం!!

‘‘మన హీరోలకు సరైన జడ్జిమెంట్ లేదు’’ అంటూ దాసరి రీసెంట్‌గా తెలుగు హీరోలపై కొంచెం ఘాటుగానే విరుచుకుపడ్డారు. అయి తే ఇది విన్న చాలామంది దాసరి చెప్పింది కరెక్టే... హీరోలకే నిజమైన జడ్జిమెంట్ ఉంటే ‘పరమవీర చక్ర’ లాంటి సినిమాలు ఎందుకు తెరకెక్కుతాయని వ్యంగ్యంగా డైలాగువేసుకుని తమలో తామే నవ్వేసుకున్నారు. అయితే పరిశ్రమ పెద్దగా, సీనియర్‌గా దాసరి గత కొన్ని సంవత్సరాలుగా పడిపోయిన సక్సెస్ శాతం... వరస ఫెయిల్యూర్స్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ మాటలను అన్నారా? హీరోలకు నిజంగానే జడ్జిమెంట్ పోయిందా?
సినిమా పరిశ్రమ మొదలైన నాటి పరిస్థితి ఎలా ఉందో కానీ ఇప్పుడు మాత్రం తెలుగుసినిమా పూర్తిగా హీరో చుట్టూ కేంద్రీకృతమైన వ్యాపారం. హీరో డేట్స్ దొరికాకే కథ గురించి ఆలోచించే స్థితి. సృజనాత్మకత అనేది సెకండరీనే. అది దర్శకుడు కావచ్చు...నిర్మాత అయినా కావచ్చు. రచయిత కావచ్చు.. హీరోని ఒప్పించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యం. తమ సినిమాలో ఏ ఎలిమెంట్స్ ఉంటే ప్రేక్షకుడికి నచ్చుతుందో అనేదాని కన్నా హీరోకి ఏ అంశాలు ఈ కథని ఒప్పుకునేలా చేస్తాయో అన్నదానిమీదే పూర్తి ఏకాగ్రత చేయాల్సిన స్థితి. అలాగని నిర్మాతలను, దర్శకులను తప్పుపట్టలేం. హీరో లేకపోతే ఓపెనింగ్స్ ఉండవు. పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరే అని చాలాసార్లు రుజువైంది. ఇప్పుడున్న థియేటర్ విధానంలో సినిమా హిట్ టాక్ వచ్చేదాకా భరిస్తూ థియేటర్‌లో ఆ సినిమాని ఆపే అంత శక్తి ఎవరికి ఉంటుంది. అంటే మొదటిరోజు మాగ్జిమం వసూళ్లు రావాలి. అంటే జనాల్ని థియేటర్‌కి తెచ్చే హీరో కావాల్సిందే. ఇలాంటి పరిస్థితిలో హిట్ సినిమా రావాలంటే అది గ్యారంటీగా హీరో జడ్జిమెంట్ గొప్పగా ఉంటేనే సాధ్యం. అదే దాసరి స్పష్టం చేసిన విషయం. మరి వరస ఫ్లాప్‌లు ఏమిటి? ఈ మధ్యకాలంలో (నివ పేజీ తరువాయ...) వరసగా శక్తి, నేనూ నా రాక్షసి, అనగనగా ఒక ధీరుడు, వాంటెడ్, అప్పల్రాజు, దొంగలముఠా వంటి చిత్రాలు చూసిన వారికి కలిగే మొదటి డౌట్...హీరోలకు నిజంగానే మైండ్ పోయిందా లేక జడ్జిమెంట్ పోయిందా అని. మొదటిరోజు మార్నింగ్ షోకే అతి సామాన్య ప్రేక్షకుడు కూడా పెదవి విరుస్తున్నాడు తనదైన శైలిలో కథలోని లోపాలను ఏకరువుపెడుతూ తిట్టుకుంటూ పోతున్నాడు. అంటే ఆ ప్రేక్షకుడు రేంజిలో కూడా మన హీరోలు ఆలోచనలు లేవా...తెల్లారి లేచి సినిమానే ప్రపంచంగా తిరిగే వారు ఈ మాత్రం కూడా ఆలోచించడం లేదా...వాళ్ల కెరీర్ కూడా తమ జడ్జిమెంట్‌తో, తాము కమిటైన సినిమాలవల్ల వచ్చే హిట్‌లపై ఆధారపడి ఉంటుంది అనేది తెలియదా? అంత అమాయకులా?
‘శక్తి’ చిత్రం చూసిన వారికి ఎన్టీఆర్ ఈ చిత్రం ఏ విషయం దష్టిలో పెట్టుకుని ఒప్పుకున్నాడు? కథ చెప్పినప్పుడే ఈ చిత్రం మగధీరకు నకలుగా ఉంది కదా...్ఫస్ట్ఫాలో ఏమీ లేదు కదా...అనే సందేహం రాలేదా అనే డౌట్ చాలామందికి వచ్చింది. అయితే ఎన్టీఆర్ ఆ సినిమాను నిర్మాత అశ్వనీదత్‌నీ, దర్శకుడు మెహర్ రమేష్‌ని వారి గత విజయాలను చూసి నమ్మకంతో చేసాడని సరిపెట్టుకోవాలి.
అంతెందుకు ‘నేను..నా రాక్షసి’ చిత్రం చూసిన వారికి గ్యారంటీగా ఇలాంటి కథను ఎలా పూరి జగన్నాధ్...తన హీరోని, నిర్మాతకీ నేరెట్ చేసి ఒప్పించాడని అనుమానం రావడం సహజం. అయతే అక్కడ ఆ కథ చెపుతున్నది ‘పోకిరి’ వంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన పూరీ జగన్నాధ్ అనే విషయం ప్లే చేసి ఉండవచ్చు. తమకు కథ పూర్తిగా అర్ధం కాకపోయినా, నచ్చకపోయినా తాము నమ్మిన దర్శకుడు తెరమీద ఏదో మ్యాజిక్ చేస్తాడనే నమ్మకంతో హీరోలు ఒప్పుకోవచ్చు. అంతమాత్రానికే హీరోలకు జడ్జిమెంట్ పోయింది అనడం ఎంతవరకు సమంజసం. దర్శకుడు గతంలో ఇచ్చిన హిట్స్‌ని దష్టిలో పెట్టుకుని అతన్ని నమ్మి కథను ఓకే చేసినప్పుడు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత హీరో జడ్జిమెంట్‌మీద అనుమాన పడి లాభంలేదు. దర్శకుడు బాధ్యతా రాహిత్యంమీద కోప్పడాలి.
మళ్లీ దాసరి దగ్గరికి వస్తే..సంక్రాంతికి ఆయన డైరక్టు చేసిన బాలకృష్ణ చిత్రం ‘పరమ వీర చక్ర’ చిత్రం విడుదలై పెద్ద ఫ్లాప్ అయింది. నేను తీసిన ఆ చిత్రం గ్రేట్ అని దాసరి ఎన్నిసార్లు మొత్తుకున్నా జనం మాత్రం దాన్ని పూర్తిస్థాయిలో తిరస్కరించారు. ఆ సినిమాలో ప్రధానంగా కథ, కథన లోపమేనని అందరూ తేల్చారు. ఎంతసేపు బాలకృష్ణను రకరకాల గెటప్స్‌లో చూపెట్టడమే సరిపోయిందని విమర్శించారు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ చిత్రం స్టార్ ఆధారితమే. మరి ఈ కథను బాలకృష్ణ వినలేదా..వింటే జడ్జిమెంట్ పోయిందా అనేది ఆలోచన రేపే అంశం.
అంతేకాక దాసరి...నేను హీరోలెవరికీ కథ చెప్పను. హీరోకి కథ చెప్పడమేంటండీ! ఇది నా సిద్ధాంతానికి విరుద్ధం. ఒకసారి ఓ హీరోతో కన్‌ఫార్మ్ అయ్యాకే హీరో పాత్రమేమిటన్నది చెబుతానన్నారు. అంటే బాలకృష్ణకు ఆయన కథ చెప్పలేదా.. బొబ్బిలి పులి లాంటి సూపర్ హిట్ ఇస్తాడనే నమ్మకంతో బాలకృష్ణ చేసాడని అనుకోవాలా..ఎందుకంటే అంతకుముందు బాలకృష్ణ నమ్మి చేసిన సింహా ఘనవిజయం సాధించింది కదా...ఆయన జడ్జిమెంట్ సరైనదే అని రుజువైంది కదా...
అంతెందుకు రామ్‌గోపాల్ వర్మ వంటి స్టార్ డైరక్టర్, ట్రెండ్ సెట్టర్..సునీల్‌ని పిలిచి నీతో సినిమా చేస్తాను అంటే కథ అడిగే అంత సీన్ ఉంటుందా. ఆయన కథ జడ్జిమెంట్ చేసేంత అవకాశం ఉంటుందా అన్నది భేతాళ ప్రశ్న. అంత నమ్మి చేసిన అప్పల్రాజు ఏమైంది? సాధారణంగా ప్రతి హీరో తను చేసే సినిమా హిట్టవ్వాలని, తన కెరీర్‌లో మరో సూపర్ హిట్ రావాలనే చేస్తాడు. అయితే రకరకాల కారణాలతో అది బెడిసి కొడుతుంది. ఒక్కడువంటి సూపర్ హిట్ ఇచ్చిన మహేష్ ఆ తర్వాత కాలంలో అర్జున్, సైనికుడు, అతిధి, ఖలేజా వంటి ఫ్లాపులను ఎందుకిచ్చాడు. ఒక్కడు టైమ్‌లో ఉన్న జడ్జిమెంట్ పవర్ ఆ తర్వాత కాలంలో మెల్ల మెల్లగా పోతూ వచ్చిందా అంటే జవాబు చెప్పడం కష్టం.
పోనీ ఇవన్నీ పక్క పెడితే రచయితకు కథమీద, కథనం మీద ఎక్కువ అవగాహన సదరు జడ్జిమెంట్ ఎక్కువ ఉంటుంది కదా. అలాంటి రచయితే దర్శకుడుగా మారి తీసిన వాంటెడ్‌ను ఎవరైనా ఎలా ఊహిస్తారు..రచయిత...డైరక్టర్‌గా మారి సినిమా చేస్తున్నాడంటే అద్భుతమైన కథ ఉంటుందనుకున్నారు. గోపీచంద్ కూడా అదే నమ్మి ఉంటాడు. ఎందుకంటే గోపీచంద్ తన జడ్జిమెంట్‌తో చేసిన సినిమాలన్నీ వరస పరాజయాలు చవి చూసినవే. అలా సొంత జడ్జిమెంట్‌ని వదిలి ఇలాంటి కథను ఒకే చేసినా ఫ్లాపులు వస్తే చేసేదేముంటుంది? అలాగని దాసరి చెప్పిన మాటను తప్పుపట్టలేం. ఇదే సమయంలో ఆయన స్టేట్‌మెంట్‌ని మరోసారి పరికిస్తే...
‘అలా...మొదలైంది’ మన తెలుగు హీరోలు ఎవరైనా చేయడానికి ఒప్పుకునేవారా? ఇదే తమిళ హీరోలైతే..పెద్ద హీరోలే ముందుకు వచ్చేవారు. అదీ వారి కమిట్‌మెంట్! ‘అలా...మొదలైంది’లో ఖర్చుపెట్టడానికి ఏం లేదు. అందుకు మన హీరోలు ఒప్పుకోరు. కానీ హిట్టయింది. ఇలా ఎందుకు జరిగిందంటే హీరో కథ, కథనం. దానిపై దృష్టి పెట్టిననాడు పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా కళకళలాడుతుందనేది నిజం‘..ఇది హండ్రెడ్ పర్సంట్ నిజం అని మనకూ అనిపిస్తోంది కదా. నిజంగానే మన పెద్ద హీరోలు ఎవరైనా అలా మొదలైందిలాంటి కథను ఒప్పుకుంటారా..శేఖర్ కమ్ముల ఆనంద్ లాంటి సినిమా చేయడానికి ముందుకు వస్తారా?
అలా మొదలైంది కేవలం కథ, ఆసక్తిగా చెప్పిన కథనంమీదే ఆధారపడి ఆడింది. ఎందుకంటే అందులో మాస్‌ని థియేటర్స్‌కి లాక్కొచ్చే హీరో లేడు. తన సెక్సప్పీల్‌తోనో, బికినీ గ్లామర్‌తో ఆకర్షించే హీరోయిన్ అస్సలు లేదు. అప్పట్లో దాసరి తాతా-మనవడు చిత్రంలో ఆయన నమ్ముకున్న కథే-హీరో సిద్ధాంతమే ఇక్కడా వర్కవుట్ అయింది. ఇలాంటి స్థితిలో ఆయన ఆ మాట అనడం సమంజసమే అనిపిస్తుంది. మరి ఏమిటి పరిష్కారం అంటే...
హీరో తాను కథను ఒప్పుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ సినిమా చేయడంవల్ల కేవలం తన కెరీర్ మాత్రమే కాక చిత్రపరిశ్రమలో బతికే చాలామంది లైఫ్‌లకు సంబంధించిన వ్యవహారమని గుర్తుపెట్టుకోవాలి. అమీర్‌ఖాన్‌లా పూర్తి బౌండెడ్ స్క్రిప్టుతో సెట్స్‌మీదకి వెళ్లగలగాలి. కథలను జడ్జి చేయడమే కాక కథలపై అవగాహన పెంచుకోగలగాలి. కథ రాయలేకపోయినా కథలో వున్న లోపాలను పసిగట్టగలగాలి. తెలుగు, తమిళంలో ఘనవిజయం సాధించిన గజనీలో సైతం క్లైమాక్స్ మార్పించి అమీర్‌ఖాన్ అద్భుత విజయం సాధించాడని గుర్తు చేసుకోవాలి. అలాగే హీరో కథ వినేటప్పుడు కేవలం తన క్యారెక్టర్ మాత్రమే చూసుకోకుండా పూర్తిగా కథ డ్రైవ్ ఎటు వెళ్తుందో గమనించుకోగలగాలి. తామే కాదు తమ సినిమాలో మరో హీరో కథ అనేది కూడా తప్పనిసరిగా ఉండాల్సిందే అని గుర్తు పెట్టుకోవాలి.
దర్శకులు సైతం తమను హీరో నమ్మాడు కదా అన్నట్లు కాకుండా బాధ్యతతో వ్యవహరించాలి. మళ్లీ దాసరిగారే చెప్పినట్టు...హీరోల్ని ప్లీజ్ చేసే కథలు కాకుండా, వాళ్లని అడ్డంపెట్టుకుని మంచి కథలతో దర్శకులు సినిమాలు తీయాలి. తమ కథ ఇదని చెప్పి, వాళ్లకిష్టమైతేనే సినిమాలు చెయ్యమని హీరోలకు చెప్పాలి. అప్పుడే మంచి సినిమాలు వస్తాయి. ఫాలో అవ్వాలి. అప్పుడు మనకూ విజయాల శాతం గ్యారంటీగా పెరుగుతుంది. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో కాకపోయినా, జాతీయ స్థాయిలో అయినా తల ఎత్తుకు నిలబడుతుంది.

                                                                               courtecy:సూర్యప్రకాష్ జోశ్యుల

                                                                                        

No comments:

Post a Comment